Wednesday, January 3, 2007

సంపూర్ణ ద్వితీయ సర్గ

అమిత బలమున గగన వీధిన
జలధి దాటిన హనుమ అప్పుడు
త్రికూట గిరి కావల వెలుగు జిలుగుల
మెరయుచున్న లంకా నగరము తేరి చూసెను 1

నూరు యోజనములు దుమికి కూడా
అలుపు ఎరుగని వీర హనుమ
పుష్ప వృస్ఠి కురుయు చుండ
త్రికూట శిఖరిన నిలచి ఉండెను ..2,3

"నూరు యోజనములని పొగడ బడు
ఈ అమిత జలధిని దాట గలిగితి
రామ కార్యము జయము చేయగ
మొదతి మెట్టును నేను దాటితి" .. 4

అని హనుమ తనలో తలచుచు
గర్వమొకింత మదిని మెదలక
దీక్ష ఇంతయు పట్టు సడలక
అలసట అస్సలు పొడను చూపక

గగన వీధిన ఎగుర గలిగిన
వీరుల నడుమ మణియగు
మారుతాత్మజుడు, సంధ్య కాంతితో
మెరయు చున్న లంక వైపుకు పయనమయ్యెను 5

భయంకర మైన కారడవులు
దట్టమైన గుబురు పొదలు
దుర్భరమౌ కొండలు గుట్టలు
సశ్య శ్యామలమౌ పచ్చిక బయళ్ళు
ఒకటి ఒకటిగ దాటు కుంటూ
లంకా నగర దిశగా పయనమయ్యెను 6

వివిధ రకముల లతల తోనూ
రంగు రంగుల పూల తోనూ
మంచి నిడివిగల చెట్లతోనూ
సువిశాల పచ్చిక బయళ్ళతోనూ
అలరారు పర్వత పంక్తుల నడుమ
దేదీప్యమానమై కాంతులీను
లంకా నగరమును హనుమ చూసెను ..7,8

దేవదారులు, కర్ణికరములు
ప్రియాలములు, ఖర్జూర గుత్తులును
నింబ వృక్షములు, కొండ మల్లెలును
మామిడి చెట్లు, మిర్చి పొలములు
కదంబ వృక్షములు, ఆసన చెట్టులు
ఏడు ఆకుల విచిత్ర అరటియు
కోవిదరములు, కరవీరములు
ఫల పుష్ప భారమున నేల తాకు లతలను
పక్షి గూళ్ళతో నిండిన వృక్ష శాఖలు
గాలి తాకిడికి తలలనాడించు వృక్ష రాజములు
పుప్పొడి గుబాళింపులు నిండిన వనములు
హంసలు నిండిన సరోవరములు
అలసట తీర్చెడి ఉత్సాహము రెట్టించెడి
సుందర దృస్యములను పర్వతాగ్రము చేరిన
వానర వీరుడు హనుమ ఆస్వాదించెను ... 9,13

స్వర్గ వాసుల నెలవుల సరితోడై
సుందర మైన కమలములు,
సుగంధ భరిత మైన కలువలతో
కూర్చిన దండలతో అలంకృతమై,
భయంకరమైన అస్త్ర ధారులైన
రాక్షస మూకలతో రక్షించ బడునదై,
అమిత బలమైన బంగారు ప్రాకార బంధితమై,
పర్వత శ్రేణుల బోలు భవనములతో అలరారునదై,
మంచి రంగుల ద్వజములతోనూ,
తోరణములతోనూ కన్నులకింపుగ గోచరితమై,
మంచి బంగారు కాంతులతో మెరయుచున్న
రహదారులతో శోభితమై,
వివిధ ఆకృతులలో మలచబడిన
చిక్కటి పొదలతో అలరారు చున్నదై,
పర్వతాగ్రమున నిర్మించ బడి,
గగన వీధిన తేలియాడు తున్నట్టున్న
రావణ పాలితము, విశ్వకర్మ నిర్మితము ఐన
లంకా నగరమును ఆనంద ఆశ్చర్యములు నిండ
విప్పారిన నేత్రములతో హనుమ కాంచెను 14,20

బలమగు ప్రహరీ ఊరువు గాను,
నీటి కందకము వస్త్రము రీతిగ,
శూలములు, శతఘ్నులు తాళము వలెనను,
భవనము, బురుజులు కుండలముల తీరుగ,
ఉత్తర ద్వారము కడ నిలిచిన హనుమకు
లంక అగుపించే అతి సుందరముగా ...21,22

కైలాసాద్రికి సరి జోడు గాను,
ఆకాశపుటంచును తాకుచున్నదియు,
గగన వీధిలో ఎగురు చున్నట్టుయు,
భువన సమమౌ భవన సంపదయు,
అతి భయంకరమౌ రాక్షస, సర్పములు
నిండిన భోగవతి పట్టణ సమమౌ,
అతి సుందరముగా అమరిన కోటయు,
కుబేర పాలిత విచిత్ర నగరియు,
పట్టిస, బాణము, సూలము, కోరలు
ఆయుధములు గా గల రాక్షస రక్షిత మైన,
శత్రు దుర్భేద్యమైన, రావణ పాలిత మగు
లంకను చూచుచు, హనుమ
మదిలో ఇట్లు తలచెను.. ...23,26

"వానర మూకలు జలధి దాటి
కష్టములోర్చి ఇచట చేరినను
దేవులకు కూడ అభేద్యమగు ఈ
లంకను గెలుచుట సాధ్యము కాదు. 27

సైన్యము కూడి, కష్టములోర్చి,
సంద్రము దాటి, కోటను చేరి,
రావణుడుండెడి లంకను కొట్టుట
భుజ బలశాలియగు శ్రీరాముని సాధ్యమా? .. 28

అమిత బలులగు ఈ రాక్షసుల
జయించను, సామము, దానము,
భేదము, దండము మరి ఏ
ఉపాయము కాన కున్నది. 29

వాలి సుతుడు అంగదుడును, నీలుడు,
నేనును ప్రభువు సుగ్రీవుడును
మాత్రమె, జలధి దాట సమర్ధులము,
సైన్య సమేతము, రాముడీ దరికేల రాగలడు? 30

ఇటులాలోచించిన సమయము నిలువదు,
సీత అస్థిత్వము మొదట కనుగొనెద,
జనక సుతను వెదికిన పిమ్మట
సైన్యము సంగతి ఆలోచించెద "...31

రామ కార్యము సఫలము చేయుటకు
పరి పరి మార్గములలోచించుచు
ఇరు వర్గముల శక్తి తూచుచూ
మనమున మరోపరి ఇటులాలోచించెను ..32

ఈ ఆకృతితో ఘొర పరాక్రములగు
రాక్షస రక్షణ మిక్కిలి గాగల
లంకను చేరుట నిక్కము జరుగదు
అమిత బలులు, మహిమాన్వితులగు
రాక్షస వీరులకు, కన్ను కప్ప వలె
సూక్ష్మ రూపమున లంకలో చేరెద
సీతను వేదుకుట ఆరంభించేద
ఇదియే తక్షణ కర్తవ్యము నాకు" ...33,35

దేవులకు కూడ గెలుచుటకు అసాధ్యమగు
దుర్భేద్యమ మగు ఆ లంకను చూచుచు
హనుమ పరి పరి విధముల ఆలోచించెను
లంక బలమునకు, అచ్చెరువందుతూ...36

"రాక్షస రాజగు రావణ పాలిత
లంకను చేరి, వారికి దొరకక
అటునిటు తిరుగుచు, జనకుని సుతయగు
సీతను వెదుకుట నాకు సాధ్యమా? ...37

నర వానరులకు సాధ్యము కాని,
లంకను చేరి, వారికి దొరకక
నా ప్రాణము నిలిపుకుని, సీతను వెదకుట
నేనొక్కడినే నెరవేర్చ గలన ? 38

రాత్రి చీకటులు ఉదయము కరుగునటుల,
ఆలోచన లేని దూత కారణముగ
మబ్బులు కమ్మిన ఆలోచ్నల వలనయు
కాగల కార్యము భంగము కలుగును 39

గెలుపు ఓటముల చింతన వలననే
నిశిత బుధ్ధులు, తొట్రుపడెదరు
దూతల గర్వము కార్యము చెరుచునని
ప్రాజ్ఞుల బోధలు ఊరక పోవు 40

కాగల కార్యము ఎటుల చేయవలె?
బుద్ధి మాంద్యము ఎటుల దాటవలె?
సంద్రము దాటుతూ పడిన శ్రమయంతయు,
ఏ విధముగా ఉపయోగించవలె? 41

అసురలకు నేను చిక్కి పొయిన
సీత రాముని చేరబోదు
రావణ సంహారము జరగబోదు
శాంతి జగతిన నెలకొనదు ..42

గాలి కూడ చొరని తావిది
రాని మాయలు లేవు వీరికి
రాక్షస రూపము దాల్చి కూడ
లంక తిరుగుట చేయలేము
కోతిరూపులో ఉండి పొయిన
నను తుదముట్టించక వదలరు వీరు
రామ కార్యము భగ్నమగును
వేరు రూపము ఏది తగును ? ...43,45

అందువలననే సూక్షమ రూపినై
కాగల కార్యము చక్క బరచగ
రాత్రి సమయమున లంక చేరెద
రావణ గృహములు వెదకి చూసెద
సీత తప్పక దొరకు గాక " 46,47

బుద్ధి కుశలుదు, వీరుడైన హనుమ
ఈవిధి ఆలోచించుచు
సీత కొరకై వెదక తలచుచు
సూర్య అస్తమయమునకు ఎదురు చూసెను 48

రవి పశ్చిమ గిరి దిగిన వెంఠనే
పిల్లి ప్రాయము తనువు కుదించి
చెంగు చెంగున గంతులేయుచు
సుందర దృశ్యము కలుగ చేసెను
అటునిటు తిరుపుచు సంధ్య సమయమున
సుందర పధంల బంగరు కాంతితో
అలరారు చున్న లంకను చేరెను 49..50

సుందర భవన సమూహములు
బంగారు కాంతులీను స్తంభములు
పీతాంబర శోభితమౌ కవాట ఘట్టములు
ఏడు ఎనిమిది అంతస్థుల ప్రాసాదములు
గంధర్వ నగరములను పోలు
వజ్ర వైఢూర్య కాంచన ఖచిత
ద్వార బంధములతొ మెరిసిపోవు
లంకా నగరమును హనుమ చూసెను 51,52

అట్టి లంకా నగరమందు
రాక్షస గృహ ప్రాంగణములు
వైధూర్యములు, పచ్చ లతో
పొదగబడి వింత కాతులు వెదజల్లు చుండె
బంగారు దారులు, వింత కాంతులతో
అలంకృతమై లంకా నగరము
ముచ్చట గోలుపుతుండె
ఆత్తి అనూహ్య మైన అందముగల
లంకను చూచుచు దానికి పట్టు
దుర్గతి తలచి చింతించుచుండె
సీతను చూడగలనని తలంపుతోనే
ఆనందముతోడి గంతులు వేసె. 53,55

ఆట్టి సుందర లంకను చూచుచు
తెల్లని ప్రాసాదముల తిరుగుచు
బంగరు వీధుల సంచరించుచు
రాక్షస వీరుల కంట బడక
అటునిటు తచ్చాడుచుండెను 56

ఇంతలో కోటి కిరణముల వెలుగు సహితము
హనుమకు చేయూతకన్నట్లు చంద్రుడుదయించె
థళథళ మెరయు చుక్కల నడుమ
తెల్లని కాంతితో చల్లని చంద్రుడు,
కొలను నడుమ అందముగా విహరించు
రాయంచ తీరున భాసిల్లు చుండెను. 57

No comments: